వేదం ప్రకారమే వర్ణ విభజన ఉంది కదా!
తనకు చెందినదైతే లోపం ఉన్నప్పటికీ సమర్ధించటం. తనకు చెందనిదైతే లోపం లేక పోయినా విమర్శించటం అన్న దుర్మార్గత లేనితనాన్నే న్యాయ దృష్టి అని అంటారు. తన-పర భేదం లేకుండా కేవలం సత్యా- అసత్యాలనే చూడగలగాలి. అప్పుడు మాత్రమే యధార్ధకు చేరుకోగలము. ఈ విషయన్ని దృష్టియందు ఉంచుకుని ముందుకు సాగాలని నా మనవి.
వేదం అంటే విద్య లేక జ్ఞానము. ముఖ్యంగా- మానవుడు తన జన్మను ఇహలోకంలో విజయవంతంగా గడిపి, పరలోకంలో ముక్తిని సాధించే విద్య. దానితో పాటు ఇతర విద్యలూ అందులో ఉన్నాయి. మనిషి సక్రమ మనుగడకు సామాజిక వ్యవస్థ తప్పనిసరి. ఆ వ్యవస్థ ఏర్పడాలంటే దానిలో అంతస్థులు ఉండటం అనివార్యం. ఏ అంతస్థుకు తగిన వ్యక్తులు ఆ అంతస్థులో సమకూరినప్పుడే వ్యవస్థ గమనం ముందుకు సాగుతుంది. లేని యెడల వ్యవస్థ స్థంబించిపోతుంది. అంతటి అనివార్యమైన ఆయా అంతస్థులకు చెందవలసిన వివిధ తరగతుల వ్యక్తులను గురించి ఈ క్రింది మంత్రంలో సర్వేశ్వరుడు తెలియజేస్తున్నాడు. కాస్త ప్రశాంతంగా గమనించగలరు.
బ్రాహ్మణలు శిరస్సునుండి, క్షత్రియులు భుజములు నుండి వైశ్యులు తొడల
నుండి మరియు శూద్రులు పాదముల నుండి జన్మించిరి. -
ఋగ్వేదం 10:90
ఒక విజయవంతమైన సంఘానికి కావలసిన నిర్మాణ క్రమాన్ని చూపించటం పై మంత్రపు అసలు లక్ష్యం అన్నది ముందుగా గమనించాలి. అందుకే అందులో ఒక అద్భుతమైన "వర్ణన" ఉంది. మరొక అత్యవసరమైన "క్రమము" ఉంది.
ముందు "వర్ణన"ను గురించి గమనించినట్లయితే- ఒక ఆరోగ్యకరమైన "శరీరము" ఒక ఆరోగ్యకరమైన "సంఘము"నకు గొప్ప సాదృస్యం!
ఇక అత్యవసరమైన "క్రమము" విషయానికి వస్తే, శిరస్సు-భుజములు-తొడలు-పాదములు శరీరమునకు ప్రముఖ విభాగములు. అవి తమ,తమ స్థానాలలో "క్రమబద్ధం"గా ఉండి, పరస్పరం "సమన్వయం"తో పని చేయాలి. ముఖ్యంగా శిరస్సు లేక మేధస్సు నుండి వచ్చే ఆదేశాలను మాత్రమే మిగతా మూడు విభాగాలూ పాటించాలి. వేటికవి సర్వ స్వతంత్రంగా పని చేయకూడదు.అప్పుడు మాత్రమే ఒక శరీరం ద్వారా విజయవంతమైన గొప్ప కార్యాలు సంభవిస్తాయి.
అచ్చం అలాగే ఒక సమాజంలోని సకల సామాన్య వర్గాల వారూ ధర్మ నిష్ఠా పరాయణలైన ఉత్తముల ఆదేశాల మేరకు మాత్రమే తమ కార్యాకలాపాలను నిర్వర్తిస్తే, అటువంటి సమాజం ద్వారానూ విజయవంతమైన గొప్ప కార్యాలు సంభవిస్తాయి. తద్వారా అందరూ సుభిక్షంగానూ, ఆనందంగానూ ఉండవచ్చును. ఈ వాస్తవాన్ని విశదీకరించటానికే పై అభివర్ణన చేయబడింది.
ఈ "అంతర్యము"ను గుర్తించక మంత్రాన్ని "అక్షరార్ధము"లో తీసుకుని విమర్శించటం ఎంతవరకు సమంజసం? ధర్మ శాస్త్రాల ప్రబోధనల "అంతర్యము"ను కాక, "అక్ష్రార్ధము"ను తీసుకుని వ్యాఖ్యానిస్తే హిందూ శాస్త్రులలోని ప్రబోధనలే కాదు. బైబిల్, ఖురాను తదితర థర్మ శాస్త్రాల ప్రబోధనలూ హాస్యాస్పదంగానే కనిపిస్తాయి.
అలాగే ఎందరో వంచకులు, స్వార్ధపరులైన శాస్త్రులు చేస్తున్న "తప్పుడు వాఖ్యానము"లను ధర్మ శాస్త్ర ప్రబోధనలు" అని భ్రమించే వారికి లేక కేవలం గుడ్డిగా విమర్శించటమే అభ్యుదయవాదమని భావించే వారికి పై మంత్రంలోని వర్ణన హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. (
Next Page)