
ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేదే మర్యాద అనేది మనకందరికి బాగా తెలిసినదే.ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ప్రకారం మర్యాద అంటే ఇతరులతో గౌరవంగా మాట్లాడటం, వారిని చక్కగా సంభోధించడం వారి శక్తిశామర్ధ్యాలను గుర్తించి ప్రశంచించడం, ఎదుటి వారి పట్ల హీనంగా, అవమానించేలా మన ప్రవర్తన లేకపోవడం మొదలగునవి.
ప్రతి వ్యక్తి ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాడు. అంతేకాక అతనిలో ఓ విధమైన శక్తి దాగి ఉంటుంది. సాధారణంగా జనులు బాహ్యంగా కనిపించే ఆడంబరాలు, డబ్బు, అధికారం మొదలగు వాటిని బట్టి ఆయా వ్యక్తులను గౌరవించడం మనం చూస్తూ ఉంటాం. ఇవి అశాశ్వతమైనవి. ఇవి చేతులు మారుతూ ఉండవచ్చు. ఇలాంటి వారికీచ్చే గౌరవం వారి ముందు మాత్రమే, వారి వెనుక రకరకాలైన కామెంట్స్ చేయడం మనకు తెలిసిన విషయమే.
నిజానికి మనిషి ఉన్నత వ్యక్తిత్వం, తెలివి తేటలు, శక్తి సామర్ధ్యాలు, తోటివారిపై వారు చూపే జాలి,ప్రేమ,దయ,కరుణ,ఆప్యాయత,అనురాగాలు, ఒక మాటలో చెప్పాలంటే మానవీయ విలువలు, వారికి ఉన్న పరిజ్నానమ్ ఇలా ఏదో ఒకటి చూసి మనం వారి పట్ల గౌరవభావాన్ని పెంచుకుంటాం. మనల్ని ఎవరైనా గౌరవిస్తేయ మనం కూడా వారిని గౌరవిస్తాం. ఒకరిపట్ల మరొకరికి అభిమానం ఉన్నంతకాలం ఒకరికొకరు గౌరవించుకోవడం మనం చూస్తుంటాము.
గమ్మత్తైన విషయమేమిటంటే కొందరు ఇతరులను అయితే గౌరవిస్తారు కానీ తమను తాము గౌరవించుకోరు. ప్రతి మనిషికి తనపట్ల తనకు గౌరవం ఉండాలి. దానినే ఆత్మగౌరవం అంటారు. ఆత్మగౌరవం లోపించినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో విజయావకాశాలు ఘోరంగా దెబ్బతింటాయి.
మన శక్తి సామర్ధ్యాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. కానీ అతి నమ్మకం పనికిరాదు.ఏ వృత్తిలోని వారైనా, ముఖ్యంగా రచనా, జర్నలిజాన్ని వృత్తిగా లేదా ప్రవృత్తిగా కలిగినవాళ్లు తమకున్న జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, తమ మెదళ్లను విజ్ఞాన ఖనిగా చేసుకునేందుకు నిరంతర పఠనం, అధ్యయనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం మన మేధస్సును గౌరవించినవారమవుతాము. మన అన్ని అవయవాల పట్ల అభిమానం, సర్వేంద్రియాల పట్ల శ్రద్ధ ఉంటే ఆత్మను గౌరవించినట్లే. లేదంటే సర్వేశ్వరుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అనేక వరాలను తృణీకరించినవారమవుతాం. ప్రతి దాన్ని గౌరవించడం, ప్రేమించడం అలవర్చుకోవాలి. పెద్దలను గౌరవించాలి. పిల్లలను ప్రేమించాలి అని ప్రవక్త(స) వారి ప్రవచన సారాంశం మనందరికి తెలిసిందే. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవటంతో మర్యాదను ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రారంభిద్దాం. శుభమ్!!