జీవితం సుఖదు:ఖాల సమాహారం. వాటిని జీవులు 'జీవిత' మాధ్యమం ద్వారా అనుభవిస్తారు. కొందరికి మహోన్నతంగా, మరికొందరికి మధ్యస్థంగా, ఇంకొందరికి హీనంగా జీవితం ఎందుకు ఆవిష్కృతమవుతుందన్న ప్రశ్న - యుగయుగాలుగా, తరతరాలుగా మానవ మేధస్సును తొలుస్తూనే ఉంది. వార్ధక్యం, వ్యాధి, సన్యాసం, మరణం వంటి వేర్వేరు జీవిత కోణాలను ఏకకాలంలో దర్శించిన సిద్ధార్ధుడిలో జీవితం పట్ల తీవ్రమైన అయిష్టత జనించింది. వాటి కారణాల అన్వేషణలో భార్యను, కుమారున్ని, సకల సౌఖ్యాలను ఆయన విడనాడాడు. ఆ ఆలోచనా వలయంలో పరిభ్రమించాడు. ఓ చెట్టు నీడలో చివరకు జీవిత సత్యమేమిటో కనుగొన్నాడు. అదే సత్యాన్ని లోకానికి వెల్లడించాడు.
ప్రపంచం పరివర్తనా శీలమైనది. మార్పు దాని సహజ లక్షణం. చెట్టు, చేమ, కొండ -కోన, పశుపక్ష్యాదులు, వాటన్నింటి కంటే మనిషి భౌతిక జగత్తులో అంతర్భాగాలు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు లక్షణాల అంత:కరణ చతుష్టయంపై పట్టు సాధించినవాడి పరిస్థితి వేరు. మనసు కారణంగా, సుఖవాంఛ మనిషిలో నిత్యం కలుగుతూనే ఉంటుంది. కోరికలు సాఫల్యమైతే సరేసరి. లేని పక్షంలో, ఇలా కోరికలు సాఫల్యం కానివారి సంఖ్యే అత్యధికం. నిజానికి, అందరూ ఎవరి స్థాయిలో వారు కోరికలు నెరవేర్చుకోలేని వారే. జీవిత స్థాయుల్లో భేదం ఉన్నప్పటికి, కోరికలు తీరకపోవడమనే లక్షణం దాదాపు అందరికీ ఒకేలా ఉంటుంది. కోరికలు తీరిన పక్షంలో దు:ఖ౦ ఉపశమించడం సహజం.
మనసు పలు కోరికల పుట్ట. అందువల్ల శాశ్వత ఆనందానికి బుద్ధుడు ఓ మార్గం ప్రతిపాదించాడు. అష్టాంగ మార్గం అనుసరించడం ద్వారా - కోరికలను జయించవచ్చు. దు:ఖాన్ని అధిగమించవచ్చు. అన్నదే ఆయన ప్రతిపాదన. జీవితం పట్ల సరైన దృక్పధం, లక్ష్యం ఏర్పరచుకొని తదనుగుణంగా వర్తించడంతో పాటు- సత్యాన్ని అనుసరించడం, ప్రవర్తన లోపరహితంగా ఉండటం, అందరూ మెచ్చే విధంగా జీవనోపాధి ఎంచుకొని అందుకు తగిన కృషిచేయడం ప్రధాన అంశాలు. వాస్తవం ఆధారంగా జీవన దృక్పధం కలిగి ఉండటం, ధ్యానం ద్వారా సత్యాన్వేషణ సాగించడమూ 'అష్టాంగ మార్గం'లోని మార్గదర్శక సుత్రాలే సృష్టిలోని సమస్త వస్తుజలంతో పాటు, మానవుడు సదా మార్పునకు లోనవు తుంటాడు. ఆ మార్పును అతడి శరీరం, మనసు ప్రతి నిత్యం ప్రకటిస్తూనే ఉంటాయి.
కోరికలు పెంచుకోవడం, అవి తీరకపోతే బాధపడటం వంటి సహజ ప్రక్రియకు భిన్నంగా మానవుడు ప్రవరించినప్పుడే- అతడు తన పరమార్ధ లక్ష్యమైన ఆనందాన్ని చేరుకొనే వీలుంటుంది. దు:ఖంలాగే ఆనందాన్ని మహాసాగరంతో పోలుస్తారు పెద్దలు. కష్టాలు వస్తే, దు:ఖాల కడలిలో మునిగిపోయి అస్తిత్వం లేనివాడవుతాడు మనిషి. అలాగే పరమానందం సిద్ధించినా, అతడు ఆనంద రస సాగరంలో ఓలలాడతాడని పారమార్ధిక శాస్త్రాలు చెబుతాయి.
జీవితం మన సొంతం. శైశవ, బాల్యంల్లో పరిరక్షణ అవసరమవుతుంది. జీవిత అంకానికి తల్లిదండ్రులు, గురువులు ఓ రూపుకర్తగా జ్ఞానం జత చేస్తారు. తానుగా బతకడం నేర్చుకున్నాక, ఆ నడవడి పూర్తిగా మనిషి చేతుల్లోకి వస్తుంది. గుర్రాల్లా పరుగెత్తే కోరికలకు కళ్లెం వేయగలిగితే, దు:ఖాన్ని నిలువరించడం సులువు' అనే గౌతమబుద్ధుడి బోధ మానవళికి ఎంతో ఉపకరిస్తుంది. కోరికల అదుపు మనిషి చేతుల్లో ఉన్నట్టే, ఆనంద ప్రాప్తి అతడి కర్మలతో ముడివడి ఉంటుందన్న సత్యాన్ని మరవకూడదు. భౌతిక సుఖాన్వేషణ లోకంలో ఆనందాన్ని అన్వేషిస్తూ గమించే సాధకుడికి సుఖదు:ఖాలు సమంగా ద్యోతకమవుతాయి. అటువంటి సాధనతో జీవితచక్రం ఒడుదొడుకులు లేకుండా సాగి, సంపూర్ణ విజయంతో ముగుస్తుంది.!