• Disclaimer
  • Privacy Policy

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Vedas
  • Bible

Recent Acticles

Home » Uncategories » అంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఇక్కడ ప్రజలు పూజించేవి దైవాలు కావా!? - Md Nooruddin

అంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఇక్కడ ప్రజలు పూజించేవి దైవాలు కావా!? - Md Nooruddin

ఈ ప్రశ్నకు హిందూ శాస్తాలైతే “ఇక్కడ ప్రజలు పూజించే ఏవీ దైవాలు” కావనే అంటున్నాయి! ఇన్నాళ్లూ ఇక్కడ ఉన్నవాటిని దైవాలనో, దేవుని అవతారాలనో భావించి ఆరాధిస్తూ ఉన్నవారికి ఈ వార్త వినటానికి కాస్త ఆందోళన కలిగించే విషయమైనా నిజం అదే! ఈ వాస్తవాన్ని ఈ క్రింది ఉపనిషత్ వాక్యాల్లో జాగ్రత్తగా గమనించగలరు.

“యన్మనసాన మనుతే యేనాహుర్మనో మతమ్ తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిద ముపాసతే”

“మనస్సు చేత గ్రహింపశక్యం కానిది, ఐతే ఎవని ద్వారా మనస్సు గ్రహింపబడుతున్నదో అది మాత్రమే నిజదైవం. ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాదని తెలుసుకో” — కేనోపనిషద్ 1:5

“యచ్చక్షుషాన పశ్యతియే న చక్షూంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదిద ముపాసతే”

“మన కళ్లతో చూడజాలనిది, మన దృష్టిని చూచేది మాత్రమే నిజ దైవము. ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాదని తెలుసుకో” — కేనోపనిషద్ 1:8

పై రెండు గమనార్హమైన పవిత్ర ఉపనిషత్ వాక్యాల్లో చెప్పబడుతున్న సత్యాలు-

1. “ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాదని తెలుసుకో”  అన్నది. మరి ఏది నిజ దైవం? ఆయనను ఎలా తెలుసుకోవాలి? అంటే....

2.“మనస్సు చేత గ్రహింపశక్యం కానిది, ఐతే ఎవని ద్వారా మనస్సు గ్రహింపబడుతున్నదో అది మాత్రమే నిజదైవం” “మన కళ్లతో చూడజాలనిది, మన దృష్టిని చూచేది మాత్రమే నిజ దైవము”.

ఏది నిజ దైవం? నేను ఆరాధించాల్సిన నిజ దేవుడు ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోగోరే ప్రతీ నిజ హైందవునికి ఏది నిజదైవమో, ఏది నిజ దైవం కాదో స్పష్టంగా విశ్లేషిస్తున్న ఈ రెండు వాక్యాలు అత్యంత గమనార్హమైనవని చెప్పవచ్చు. “ఇక్కడ” అంటే “ఇహ లోకంలో” లేక “ఈ సమస్త భూమి పై” అని అర్థం. వివరంగా చెప్పాలంటే ఈ భూమండలం మీద ప్రజలు దేవుళ్లుగా భావించి పూజిస్తున్న సృష్టితాలు, ప్రాకృతిక వస్తువులు, మహనీయులు వగైరా వగైరా ఏవీ దైవాలు కావు.  అంటే ఏ ఒక్కటీ / ఏ ఒక్కరూ దైవత్వం కలిగి లేదు / కలిగి లేరు అని అర్థం. ఇది చదివి ఎవరైనా లాజిక్కులు పక్కన పెట్టేసి ఇప్పుడు “మేము పూజించే దేవుళ్లను దేవుళ్లు కాదంటారా? అది చెప్పటానికి మీరెవరు! అని చెబుతూ కళ్లెర్రజేసి, కోపంతో పళ్ళు కోరుకుతూ ఆక్రోశంతో ఊగిపోయినా చేసేదేమీ లేదు! ఎందుకంటే ఈ విషయం చెబుతుంది ఎవరో కాదు! స్వయంగా హిందూ శాస్త్రాలే కదా!  కాబట్టి భావావేశాలు ప్రక్కన పెట్టి, ప్రశాంత హృదయంతో నిజ దైవం ఏది? అన్న జిజ్ఞాశ కలిగి పరీలిస్తేనే నిజదేవుడు ఎవరో? తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజ దేవుడెవరో తెలుసుకోవటం అన్నది ఏదో ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు, మోక్షానికి సంబంధించిన విషయం కదా! 

"అది మాత్రమే నిజదైవం" అంటే ఎవరు “ఆ నిజ దేవుడు”? 

“మనస్సు చేత గ్రహింపశక్యం కానిది” అన్న వాక్య భాగాన్ని బట్టి- “కనీసం ఫలానా విధంగా ఉంటాడు/ఉండవచ్చు/బహుశా అలా ఉండవచ్చునేమో/ఇలా ఉంటాడేమో అన్న ఏ స్కేలుతోనూ  కొలవటం సాధ్యం కాని అస్తిత్వమే దేవుడు అన్న విషయం తేలిపోతుంది. ఇదే విషయాన్ని ఈ క్రింది భగవద్గీత శ్లోకం వివరిస్తుంది.

“ఇట్టిదని నిర్దేశింపశక్యం కానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవి కానిదియు, నిర్విరాకమైనదియు, చలింపనిదియు, అంతటను వ్యాపించియున్నది యునగు అక్షర పరబ్రహ్మను ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుదురు” — గీత 12:4

పై శ్లోకంలో సర్వేశ్వరుడైన దేవుని అస్తిత్వం ఎటువంటిదో చెప్పబడుతుంది. అందులో ముఖ్యంగా గమనించాల్సిన శ్లోక భాగాలు- “అనిర్ధేశ్యం” అంటే- “ఇట్టిదని నిర్దేశింపశక్యం కానిదియు” అంటే ఇలా ఉంటాడేమో అని నిర్దేశించటానికి అవకాశం సైతం లేని అస్తిత్వం కలవాడు అని అర్థం. “అచిన్త్యమ్” అంటే- “ఊహలకు సైతం అందని స్వరూపం కలవాడు” అని అర్థం. ఇదే విషయం భగవద్గీతా శాస్త్రం 8 వ అధ్యాయం 9 వ శ్లోకంలో సైతం — “అచిన్త్యరూపమ్” = “ఊహలకు సైతం చిక్కని రూపం కలవాడు” అని చెప్పబడింది. అదే విషయం ఈ క్రింది ఉపనిషత్ వాక్యంలో సైతం ఎంతో తేటగా చెప్పబడింది.

“నా సందృశే తిష్ఠతి రూపమస్య నచక్షు షాపశ్యతి కశ్చనైనమ్”

“దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలువదు. కన్నులతో ఎవరూ ఆయనను చూడలేరు” — శ్వేతాశ్వరోపనిషత్ 4:20

పై వాక్యాన్ని బట్టి మనిషి పంచేంద్రియాలలో దేనికీ చిక్కని స్వరూపం కలవాడే దేవుడు అన్న విషయం నొక్కివక్కాణించబడుతుంది. అంతే కాదు- “కన్నులతో ఎవరూ ఆయనను చూడలేరు” అన్న వాక్య భాగాన్ని బట్టి అర్థమయ్యే విషయం- “కన్నులతో అందరూ చూడగలిగేది ఏదీ నిజ దైవం కాదు! అన్న విషయం సుస్పష్టం అయింది”. 

ఇప్పటి వరకూ సాగిన విశ్లేషణ వెలుగులో దేవుడు “ఫలానా విధంగా ఉండవచ్చునేమో అని నిర్దేశింపశక్యం కానివాడు” “మనస్సు చేత గ్రహింపశక్యం కాని రూపం కలవాడు” “ఊహలకు సైతం అందని స్వరూపం  కలవాడు” “ఇంద్రియాల పరిధిలో నిలువని రూపం కలవాడు” అన్న విషయాన్ని తెలుసుకున్నాం. దీనిని బట్టి దేవుని స్వరూపం- మనస్సులో ఏదో ఓ రూపాన్ని ఊహించుకుని చిత్ర లేఖనం ద్వారా గీయటానికి సాధ్యపడనిది! ఏదో ఒక రూపాన్ని తలచుకుని చేతులతో విగ్రహంలా మలచటానికి అవకాశం లేనిది! ఫలానా విధంగా ఉండవచ్చని నోటితో చెప్పటానికి సాధ్యం కానిది! అన్న విషయం తేటతెల్లమైపోయింది. వాస్తవం ఇదైనప్పుడు “మనుషులు చేతులతో చెక్కిన విగ్రహాలు! కుంచెలతో గీసిన చిత్రాలు! చేతులతో మలచబడిన రూపాలను” పట్టుకుని దేవుళ్లని, దేవుని స్వరూపాలని ఆరాధించటం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న. 

దేవుడు మానవదేహంతో అవతరించేవాడు అని చెప్పేవాడు అవివేకా?

“అవ్యక్తం వ్యక్తి మాపన్నం మాన్యన్తే మామ బుద్ధయః పరం భావ మజానన్తో మమావ్యయ మనుత్తమమ్”

“నాశరహిత మైనట్టియు, ప్రకృతికి పరమై విలసిల్లునట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు అవ్యక్త రూపుడనగు నన్ను పాంచ భౌతిక దేహము పొందిన వానిగా తలంచుచున్నారు” — గీత 7:24

పై శ్లోకంలో “అవ్యక్తం” అంటే “ఈ లోకంలో ఏ విధంగానూ వ్యక్తం కానివాడు” అని అర్థం. దీనిని బట్టి  “అనిర్ధేశ్యం” అంటే- “ఇట్టిదని నిర్దేశింపశక్యం కానిది”, “అచిన్త్యమ్” అంటే- “ఊహలకు సైతం అందని స్వరూపం కలవాడు” “అవ్యక్తుడైన దేవుడు” ఈ లోకంలో మానవ స్వరూపం ధరించి వ్యక్తమయ్యాడు లేక అవతరించాడు అని చెప్పేవారు వివేకులు కారని తెలుస్తుంది.

సృష్టిలో దైవం ఉన్నాడా?

సృష్టిలో ప్రతి పదార్థంలోనూ, మనిషిలోనూ దేవుడు ఉన్నాడు.  సృష్టి మూల పదార్థమే సృష్టికర్త.  సృష్టిలో ప్రతీదీ సాక్ష్యాత్తు సృష్టికర్తే! అన్న ఈ భావన నుండి పుట్టిందే సృష్టి ఆరాధన. అయితే ఈ భావనను భగవద్గీత ఎంతవరకు సమర్థిస్తుందో ఈ క్రింది శ్లోకంలో గమనించగలరు.

“ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపించబడి యున్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి. నేను వానియందుండుట లేదు” — గీత 9:4

“నేను వాని యందు (అంటే- సమస్త ప్రాణికోట్లలో) ఉండుట లేదు” అన్న దానిని బట్టి దేవుడు సమస్త సృష్టిని సృష్టించినప్పటికీ ఆయన సృష్టిలో అస్తిత్వ పరంగా లేడని తెలుస్తుంది. కానీ ఆయన జ్ఞానం, ఆయన శక్తి విశ్వంలో కణం కణం లో వ్యాపించి ఉంది. ఇదే విషయం “సర్వేశ్వరుడైన దేవుడు విశ్వంలో కణం కణం లో వ్యాపించి ఉన్నాడు. విశ్వంలో ఆయన లేని ప్రదేశం లేదు”- యజుర్వేదం 32:11 అని వేదం చెబుతుంది. కాబట్టి సృష్టిలో ఏదీ సాక్ష్యాత్ దైవ పదార్థం కాదు.

కాబట్టే ఇక్కడ ఉన్నది ఏదీ దైవాలు కావు!

“ఏకదైవారాధన”కు, “బహుదైవారాధన”కు మధ్య ఉన్న బేధం సింపుల్ గా చెప్పాలంటే “ఏక దైవారాధన” విశ్వాసం — దేవుడు ఇక్కడివాడు కాడు, అక్కడి వాడు అంటే “పై వాడు” అని చెబుతుంది. దీనికి భిన్నంగా — “అక్కడి వాడే ఇక్కడికి వచ్చేశాడు! ఇక్కడ ఉన్నవి కూడా దైవాలే!” అని చెప్పేది “బహుదైవారాధన” విశ్వాసం. మరి ఇంతకూ హిందూ శాస్త్రాలు “ఇక్కడ ప్రజలు పూజిస్తున్నవి  దైవాలని చెబుతున్నాయా?” లేక “అక్కడ ఉన్న వాడు  (పై వాడు) మాత్రమే దేవుడని చెబుతున్నాయా?” అంటే ఇప్పటివరకూ మన విశ్లేషణలో “ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాద”న్న  యదార్థాన్ని మనల్ని తెలుసుకోమని మరీ  హిందూ శాస్త్రాలు ఆజ్ఞాపిస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకున్నాము. దీనిని బట్టి ఇక్కడ ప్రజలు పూజిస్తున్నవి  అంటే- ప్రకృతిలో ఉన్న సూర్యచంద్రాదులు, చెట్లు, జంతువులు, మనుషులు వగైరా వగైరా ఏవీ దైవాలు కావని తెలుసుకున్నాం. అందుకే “అధః తమ ప్రవయన్తి యె అసంభూతి ముపన్తే” అనగా - “ప్రాకృతిక వస్తువులను, సంభూతిని అంటే- సృష్టితాలను పూజిస్తారో వారు అంధకారంలో ప్రవేశిస్తారు”- యజుర్వేదం 40:9 అని వేదం హెచ్చరిస్తుంది.

అయితే ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తవచ్చు. ఇక్కడ ప్రజల్లో అనేకమంది నిజ దేవుని ఆరాధకులు కూడా ఉన్నారు కదా! మరి ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాదని ఉపనిషత్తులు  చెబుతున్నాయి కదా!? అని. నిజమే కానీ కంటికి కనిపించే, ఇంద్రియాలకు గోచరించే వాటిని పూజించే ప్రజలే అధిక శాతం మంది ఉన్నారు! కాబట్టే “ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాద”ని చెప్పబడింది.

మరి దేవతలు కూడా ఇక్కడి వారు కాదుగా!

“ఇక్కడ ప్రజలు పూజించేది దైవం కాద”న్నప్పుడు మరి దేవతలు కూడా ఇక్కడివారు కాదు కదా? వారు ఆరాధనకు అర్హులు కారా? అన్న ప్రశ్న ఒకటి రావచ్చు. దేవతలు పరలోక జీవులే! దేవతలను సృష్టించింది సైతం దేవుడే! తప్ప దేవతలు  దైవాలో, దైవంలో భాగస్వాములో ఎంతమాత్రం కావు!  అందుకే భాగవద్గీతలో “దేవతలను ఆరాధించువారు దేవతలను, భూతములు (సృష్టిపదార్థాలను) ఆరాధించేవారు భూతములను, నన్ను ఆరాధించేవారు నన్నే పొందుచున్నారు” — గీత 9:25 అంటూ సర్వేశ్వరుడైన దేవుడు తనకు అతీతంగా దేవతలు, భూతములు అన్న భేదాన్ని చూపుతున్నాడు. పైగా దేవతలను ఆరాధిస్తే దేవతలను,  భూతములు (సృష్టిపదార్థాలను) ఆరాధిస్తే భూతములను మాత్రమే పొందుతారు నన్ను మాత్రమే ఆరాధిస్తే నన్ను పొందుతారని చెప్పటాన్ని బట్టి దేవతలు, సృష్టిపదార్థాలు గానీ ఏవీ దైవత్వ శక్తిని కలిగి లేవని తేటతెల్లమైపోయింది. అందుకే సర్వేశ్వరుడైన దేవుడు “దేవతలను ఆరాధించువారు దేవతలనే పొందుచున్నారు. నా భక్తులు నన్నే పొంచున్నారు” — గీత 7:23 అని చెబుతున్నాడు.

ఇక “నా భక్తుడవును, నన్నే పూజించువాడవును అగుము. నన్నే నమస్కరింపుము” — గీత 9:34 / నన్నొక్కని మాత్రమే శరణు బొందుము” — గీత 18:66 అన్నది సర్వేశ్వరుడైన దేవుని ఆదేశం. లేదు ఇక్కడ ఉన్నవాటిని / ఇక్కడ ఉన్నవారిని కూడా పూజించవచ్చన్నది కొందరు శాస్త్రుల ఆదేశం. కాబట్టి “ఇక్కడ ప్రజలుపూజిస్తున్న వేవీ దైవాలు” కావని హిందూ శాస్త్రాలు చెబుతున్నప్పుడు లాజిక్కులు ప్రక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న వాటిని పూజించాలా? లేక హిందూ శాస్త్రాలు పరిచయం చేస్తున్న నిజ దైవం అయిన ఆ పైవాడిని మాత్రమే దేవునిగా అంగీకరించి ఆయనను మాత్రమే పూజించాలా? అన్నది తమకు ఉన్న లాజిక్ ని బట్టి సరైన జడ్జ్ మెంట్ ప్రజలే చెయ్యగలరు. 

← Newer Post Older Post → Home

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక…
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే…
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ…
  • శుభవార్త: "సిలువ…బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ…
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క…
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే…
  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం…
  • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
    బ్లాగర్లలో కొంతమంది "సాక్ష్యం బ్లాగ్" పట్ల వింత,వింత వ్రాతలు వ్రాస్తున్నారు. ఇదేదో ఇస్లాం మతం వైపునకు లాక్కుపోయేదిగాను, వైధిక మ…
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద…

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం
Copyright © 2014– Sakshyam Magazine