బైబిల్లో ముహమ్మద్ (స) ప్రస్తావన, ఖురాన్ ప్రస్తావనలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయన్న వాస్తవం బహిర్గతమైపోతే ఎక్కడ సామాన్య క్రైస్తవ ప్రజానీకం ఇస్లాం పట్ల ఆకర్షితులైపోతారో అన్న ఆందోళనలో పడి నేటి అధిక శాతం క్రైస్తవ బోధకులు చేస్తున్నది / చేయగలుగుతున్నది కేవలం ఇస్లాం పై, ఖురాన్ పై గ్రుడ్డి విమర్శలు చెయ్యటం, బైబిల్లో ముహమ్మద్ (స) ప్రస్తావన గానీ, ఖురాన్ ప్రస్తావన గానీ లేదని చెబుతూ వాదించటం తప్ప మరొకటి లేదు! కాలాన్ని వెనక్కి తీసుకెళ్లటం ఎంత అసాధ్యమో సత్యాన్ని ఎక్కువ కాలం దాచి ఉంచటం కూడా అంతే అసాధ్యం! బైబిల్లో ఖురాన్ రానై ఉన్నదన్న సత్యాన్ని ఎంత దాచి ఉంచుదామన్నా సత్యానికి ఉన్న గుణం ఏమిటంటే అది అత్యంత బలంగా స్థాపించబడటమే! మోషే ధర్మశాస్త్రం అనంతరం భవిష్యత్తులో పారాను (అరేబియా) నుండి శక్తివంతమైన మరొక ధర్మశాస్త్రం రానై ఉందన్న సత్యాన్ని కప్పి పుచ్చటానికి కొందరి ద్వారా జరిగిన అనేక ప్రయత్నాల్లో ఒకటి ముందుగా ఈ క్రింది లేఖనంలో గమనించగలరు.
“యెహోవా సీనాయి నుండి వచ్చెను శేయీరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను” - ద్వితీ 33:2
పై లేఖన భాగంలో ముగ్గురు ప్రవక్తల రాకడను గురించి అలంకారికంగా యెహోవా రానైఉన్నాడని చెప్పబడింది. ఆ ముగ్గురు ప్రవక్తలలో ఒకరు- సీనాయి ప్రాంతానికి చెందినవారు / మరొకరు- శేయీరు ప్రాంతానికి చెందినవారు /చివరిగా రావలసిన ఇంకొకరు- పారాను ప్రాంతానికి చెందినవారు అని తెలుస్తుంది. సీనాయి ప్రాంతం నుండి వచ్చిన ప్రవక్త మోషే అన్నది అందరికీ తెలిసిందే! శేయీరు ప్రాంతం నుండి వచ్చిన ప్రవక్త యేసు అన్న విషయమూ అందరికీ తెలిసిందే! మరి తెలుసుకోవలసింది “పారాను” అంటే అరేబియా ప్రాంతం నుండి రావలసి ఉన్న ప్రవక్త ఎవరు? అన్నదే! ఈ పాయింటు కాస్త ఇబ్బంది పెట్టె విషయమైనా, వాస్తవం అందరికీ తెలిసిందే. అదేమిటంటే- అరేబియాలో ఉన్న పారాను నుండి వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) అన్నది. ఇక సీనాయి, పారాను కొండలు ఒకదానికి ఒకటి ఆనుకుని అరేబియా భూభాగంలోనే విస్తరించబడి ఉన్నాయి. అలాగే, సీనాయి కొండ సైతం అరేబియా భూభాగంలోనే ఉందన్న విషయం బైబిలే ఎలుగెత్తి చాటుతుంది — “అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే” — గలతీ 4:25.
సరే, సంక్షిప్తంగా చెప్పాలంటే పారాను అంటే అరేబియా ప్రాంతం నుండి ఒక ప్రవక్త రానై ఉన్నారన్న విషయం మనకు తేటతెల్లమైపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- పారాను నుండి రావలసి ఉన్న ప్రవక్త ద్వారా వేరొక ధర్మశాస్త్రం ఇవ్వబడనుందన్నది. అయితే ఈ విషయం మరుగుపరచటానికి చేయబడిన కుట్ర ఏమిటో ఈ క్రింది లేఖన భాగాన్ని దాని మూలంలో వ్రాయబడిన అసలు విషయాన్ని చదివితే తెలుస్తుంది.
“ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు"మెరియుచుండెను”
FROM HIS RIGHT HAND WENT A FIERY LAW FOR THEM
పై లేఖన భాగం జాగ్రత్తగా చదివితే మోషే ధర్మశాస్త్రం తరువాత భవిష్యత్తులో పారాను (అరేబియా) నుండి శక్తివంతమైన మరొక ధర్మశాస్త్రం రానై ఉందన్న సత్యాన్ని కప్పి పుచ్చటానికి ఏ విధంగా కుట్రపూరితమైన ప్రయత్నం జరిగిందో తెలుసుకోగలం. నిజానికి ఈ లేఖన భాగం KJV ఇంగ్లీషు బైబిల్లో -
“FROM HIS RIGHT HAND WENT A FIERY LAW FOR THEM” - Deuteronomy 33:2
:అని చదవగలం దీనిని ఉన్నట్టు అనువదిస్తే లేఖనాన్ని ఈ క్రింది విధంగా చదువగలరు:-
“ఆయన కుడి పార్శ్వము నుండి అగ్ని జ్వాలాల వంటి ధర్మశాస్త్రము వారి కొరకు వచ్చెను” అని చదవగలం. అయితే "A FIERY LAW" అంటే - “జ్వాలాభరితమైన ధర్మశాస్త్రము” అని అనువదించక, "అగ్నిజ్వాలలు మెరియుచుండెను” అని ఏ మాత్రం పొంతన లేని అనువాదం చెయ్యటం జరిగింది.
గమనిక: “A FIERY LAW” అన్న పదానికి నిఘంటు అర్థం- “అగ్ని జ్వాలాల వంటి ధర్మశాస్త్రము” అన్నది. అంటే- “జ్వాలాభరితమైన ధర్మశాస్త్రము” లేక “ప్రకాశవంతమైన ధర్మశాస్త్రము” అని చెప్పవచ్చు. “ప్రకాశం” అన్నది “జ్ఞానానికి సాదృశ్యం”. వివరంగా చెప్పాలంటే- అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (స) ద్వారా పారాను నుండి “ప్రకాశవంతమైన మరియు జ్ఞానభరితమైన ధర్మశాస్త్రం” వారి కొరకు అంటే పారాను ప్రాంత ప్రజలైన ఇష్మాయేలీయుల కొరకు రానైయున్నదని తేటతెల్లమవుతుంది. ఇక అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) వారి ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం “ఖురాన్” గ్రంథం అన్న విషయం జగద్విదితమే!
ఖురాన్ రాకడకు సంబంధించిన సత్యాన్ని కప్పిపుచ్చటానికి జరిగిన రెండవ ప్రయత్నం!
పై వివరణలో ఖురాన్ రాకడకు సంబంధించిన లేఖనాన్ని తెలుగులో ఏ మాత్రం పొంతనలేని అనువాదం చేసి, ఏ విధంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో గమనించాం. అదే విధంగా భవిష్యత్తులో వేరొక ధర్మ శాస్త్రం తన వద్ద నుండి బయలు వెళ్లనుందని యెహోవా చేస్తున్న వాగ్దానానికి సంబంధించిన ఈ క్రింది మరొక లేఖనాన్ని గమనించగలరు.
“నా ప్రజలారా, నా మాట ఆలకించుడి నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలు దేరును” — యెషయా 51:4
పై లేఖనంలో- “ఉపదేశము నా యొద్ద నుండి బయలు దేరును” అన్న లేఖన భాగం అసలు ఏమాత్రం పొంతన లేని అనువాదం అన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. “ఉపదేశము నా యొద్ద నుండి బయలు దేరును” అన్న లేఖన భాగం ఒకసారి KJV ఇంగ్లీష్ బైబిల్లో ఎలా వ్రాయబడి ఉందో ఒకసారి ఈ క్రింది చదువగలరు.
“A LAW SHALL PROCEED FROM ME”
పై ఇంగ్లీషులో పేర్కొనబడ్డ లేఖనం ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే-
“ధర్మశాస్త్రం నా యొద్ద నుండి బయలుదేరును” అని చదవగలం.
ఈ లేఖనం యెషయా 51:4 లో పేర్కొనబడి ఉంది. అంతకు పూర్వమే యెహోవా తరఫు నుండి మోషేకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉందన్న విషయం నిర్వివాదం (ద్వితీ 31:9, నిర్గమ 31:18). అయితే మోషేకు ఒక ధర్మశాస్త్రం ఇవ్వబడిన తరువాత చాలా కాలం అనంతరం దేవుని తరఫు నుండి చెయ్యబడుతున్న వాగ్దానమే- “ధర్మశాస్త్రం నా యొద్ద నుండి బయలుదేరును (A LAW SHALL PROCEED FROM ME)” అన్నది.
వేరొక ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడనున్నది? యేసు ద్వారానా? ముహమ్మద్ ద్వారానా?
పైన మనం గమనించిన ద్వీతీయోపదేశకాండం 33:2 లేఖనంలో “ఆయన కుడిపార్శ్వము నుండి ప్రకాశవంతమైన ధర్మశాస్త్రం వచ్చును” అన్న వాక్య భాగం ఒకవేళ యేసు గురించేమో!? అన్న సందేహం కొందరు పైకి చెప్పకపోయినా లోలోపల మధన పడుతూ ఉంటారు. సరే, ఆ కోణంలో ఒకసారి ఆలోచించినా యేసుకు యెహోవా తరఫు నుండి వేరొక ధర్మశాస్త్రం ఇవ్వబడిందా? లేక మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమే యేసు కూడా బోధించేవారా? అన్నది గమనిస్తే-
“ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను; కృపాయు, సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను” — యోహాను 1:17
అన్న వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడితే ఇక యేసు ద్వారా అనుగ్రహించబడింది- కృపాసత్యములు! దీనిని బట్టి యేసు ద్వారా క్రొత్త ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ఈ విషయాన్ని స్వయంగా యేసే ఈ క్రింది విధంగా చెబుతున్నారు.
“ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గానీ కొట్టి వేయుటకు నేను రాలేదు” — యోహాను 5:17
పై యేసు యొక్క వాంగ్మూలాన్ని బట్టి అప్పటి వరకు ఉన్న మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికే యేసు వచ్చారు తప్ప క్రొత్త ధర్మశాస్త్రం ఇవ్వటానికైతే యేసు పంపబడలేదని తేటతెల్లమైపోయింది. దీనిని బట్టి వేరొక ధర్మశాస్త్రం ఇచ్చే వ్యక్తి (Law giver) యేసు అనంతరం రావలసి ఉందన్న విషయం సుస్పష్టమౌతుంది. పైగా ముందు వివరణలో ప్రకాశవంతమైన వేరొక ధర్మశాస్త్రం “పారాను” (అనగా అరేబియా ప్రాంతం) నుండి ఉద్భవించనుందని గమనించి ఉన్నాం. ఇక యేసు రావలసింది లేఖనం ప్రకారం ఇశ్రాయేల్ లో ఉన్న బెత్లెహాము (మీకా 5:2) నుండి తప్ప అరేబియాలో ఉన్న పారాను నుండి మటుకు కాదు! దీనిని బట్టి వేరొక ధర్మశాస్త్రం యేసు అనంతరం రానైయున్న ముహమ్మద్ (స) ద్వారా మాత్రమే ఇవ్వబడనుందన్న విషయం తేటతెల్లమైంది.
క్రొత్త ధర్మశాస్త్రం వేరొక భాషలో “కొంచెం కొంచెంగా” అవతరించనుంది!
ఇప్పటివరకూ సాగిన వివరణలో వేరొక ధర్మశాస్త్రం పారాను నుండి అంటే అరేబియా ప్రాంతం నుండి రానైయున్నదని, అది ఇష్మాయేలు కుమారుడైన కేదారు వంశంలో పుట్టిన ప్రవక్త ముహమ్మద్ (స) వారి ద్వారా ఇవ్వబడిన ఖురాన్ గ్రంథమే అన్న విషయాన్ని తెలుసుకున్నాం. బైబిల్ గొప్పతనం ఏమిటంటే- వేరొక ధర్మశాస్త్రం పారాను నుండి రానున్నదని మాత్రమే చెప్పి వదిలి పెట్టటం లేదు! పైగా అది "వేరొక భాష"లో అంటే యూదులకు పూర్తిగా తెలియని "అన్య భాష"లో అవతరించనుందని, అంతేకాక ఆ క్రొత్త ధర్మశాస్త్రం సైతం "కొంచెం కొంచెంగా" అవతరించనుందని స్పష్టంగా ప్రకటిస్తున్న ఈ క్రింది బైబిల్ లేఖనాన్ని గమనించగలరు.
“ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట (చెప్పుచున్నాడని వారానుకొందురు). నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి పెదవులచేతను అన్య భాషతోనూ ఈ ప్రజలతో మాట్లాడుచున్నాడు. అయిననూ వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మ్రొగ్గి విరుగబడి చిక్కబడి పట్టుబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును” — యెషయా 28:10-13
పై లేఖనంలో “నత్తి పెదవులచేతను అన్య భాషతోనూ ఈ ప్రజలతో మాట్లాడుచున్నాడు” అన్నది ఇంగ్లీషు KJV బైబిల్లో గమనిస్తే –
“For with stammering lips and ANOTHER TONGUE will he speak to this people” — Isaiah 28:10-13
అని చదవగలం. దీని అర్థం- “నత్తి పెదవులచేతను వేరొక భాషతోనూ (ANOTHER TONGUE) అతడు ఈ ప్రజలతో మాట్లాడును” అని. ఇది చివరి ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఆగమనం మరియు ఆయన తీసుకుని వచ్చే క్రొత్త ధర్మశాస్త్రానికి సంబంధించిన స్పష్టమైన లేఖనం అని చెప్పవచ్చు. “నత్తి పెదవులు" అన్నది నిరక్షరాశ్యతకు అలంకారికంగా చెప్పబడింది. ముహమ్మద్ (స) పూర్తిగా నిరక్షరాశ్యులు. గమనార్హమైన ఈ లేఖనంలో చెప్పబడ్డ అంశాలను జాగ్రత్తగా గమనిస్తే-
1.“ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును” అన్న వాక్య భాగాన్ని బట్టి పారానుండి రావలసి ఉన్న వేరొక ధర్మశాస్త్రం సీనాయి పర్వతం మీద మోషేకు ధర్మశాస్త్రం ఒకేసారి ఇవ్వబడినట్లుగా (మలాకీ 4:4) ఇవ్వబడదు గానీ, అది కొంచెం కొంచెంగా సందర్భానుసారం అవతరించనుందని తెలుస్తుంది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం- దేవుడు, ప్రవక్త ముహమ్మద్ (స) వారి పై ఖురాన్ గ్రంథాన్ని ఒకేసారి అవతరింపజేయలేదు! కానీ, కొంతభాగం మక్కాలో మరి కొంతభాగం మదీనాలో ఒక ఆజ్ఞ తరువాత మరొక ఆజ్ఞ చొప్పున 23 సంవత్సరాలు సందర్భానుసారం అవతరింపజేశాడు అన్నది. ఇదే విషయాన్ని దేవుడు అటు బైబిల్, ఇటు ఖురాన్ గ్రంథాల్లో ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు.
“మేము ఈ ఖురానును కొద్ది కొద్దిగా అవతరింపజేశాము; నీవు దానిని నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించాలని. మేము సందర్భాన్ని బట్టి క్రమక్రమంగా అవతరింపజేశాము” — ఖురాన్ 17:105, 106
“ఓ ప్రవక్తా! మేమే ఈ ఖురాన్ ను కొంచెం కొంచెంగా నీ పై అవతరింపజేశాము” — ఖురాన్ 76:23
“కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును” — యెషయా 28:13
2.“నత్తి పెదవులచేతను అన్యభాషతోనూ (ANOTHER TONGUE) అతడు ఈ ప్రజలతో మాట్లాడుచున్నాడు” అన్న లేఖన భాగంలో “అన్యభాష” అన్న పదాన్ని ఇంగ్లీష్ KJV బైబిల్లో “ANOTHER TONGUE” అని చూడగలం. అంటే “వేరే భాష” అని అర్థం. దీనిని బట్టి క్రొత్త ధర్మశాస్త్రాన్ని చివరి ప్రవక్త “వేరొక భాషలో” అంటే యూదులకు సుపరిచితమైన హెబ్రూ, అరమైక్, గ్రీకు భాషల్లో కాక వారికి పూర్తిగా అపరిచితమైన “వేరొక భాష”లో బోధించనున్నారని తేటతెల్లమవుతుంది.
3.ఒకవేళ యూదులకు అపరిచితమైన వేరొక భాషలో మాట్లాడే ఆ ప్రవక్త యేసు అని అనుమానపడేవారు తెలుసుకోవలసింది- యేసు మహిమపరచబడిన తరువాత సైతం యూదులకు సుపరిచితమైన హెబ్రీ భాషలోనే మాట్లాడినట్టు చూడగలం (అ.పో.కా 26:14). పైగా మోషే హెబ్రీయులైన యూదులకు ప్రవక్త (నిర్గమ 2:8)! కానీ, ఇష్మాయేలియుల వద్దకు పంపడిన చివరి ప్రవక్త ముహమ్మద్ (స) మాట్లాడిన భాష “అరబ్బీ” అది యూదుల మాతృ భాష కానే కాదు! వివరంగా చెప్పాలంటే “అరబ్బీ” యూదుల దృష్టిలో “అన్య భాష” లేక “వేరొక భాష” మాత్రమే!
బైబిల్ ప్రకారం ఖురాన్ ను దేవుడు హృదయాల మీద వ్రాయనున్నాడు!
ఈ టాపిక్ చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఉద్భవించవచ్చు. అదేమిటంటే- అప్పటికే దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని మోషేకు ఇచ్చి ఉన్నాడు కదా! మరలా తిరిగి వేరొక క్రొత్త ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? ముందుగా దానికి సమాధానం ఈ క్రింది లేఖనంలో గమనించగలరు.
“ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే- వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను; వారి హృదయములమీద దాని వ్రాసెదను” — యిర్మియా 31:31,32
పై లేఖనంలో గమనించాల్సిన ముఖ్య విషయాలు:
1.పై లేఖనంలో “నిబంధన (Covenant)” అన్న పదం “ధర్మశాస్త్రం (Law)” అన్న పదానికి ప్రత్యామ్నాయంగా చెప్పబడిందన్నది.
2.ఆ క్రొత్త నిబంధన లేక క్రొత్త ధర్మశాస్త్రం మోషే ద్వారా గతంలో యూదులకు ఇవ్వబడినటువంటి పాత ధర్మశాస్త్రం (పాతనిబంధన) వంటిది కాదు అన్నది.
3.ఇప్పుడు క్రొత్తగా మరో ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి కారణం యూదులు తమకు ఇవ్వబడిన నిబంధనను “వారు భంగం చేసుకొనిరి (my covenant (Law) they break)”.
4.“యెహోవా ద్వారా ఇవ్వబడే ఈ క్రొత్త ధర్మశాస్త్రం మరో ప్రత్యేకత ఏమిటంటే- దానిని గతంలో మోషేకు ఇవ్వబడిన పాత ధర్మశాస్త్రం మాదిరిగా కేవలం వ్రాతరూపంలోనే కాక, ఆ ధర్మశాస్త్రాన్ని “హృదయాల మీద వ్రాసెదను” అంటున్నాడు. దీని అర్థం- భవిష్యత్తులో దేవునిచే ఇవ్వబడే క్రొత్త ధర్మశాస్త్రాన్ని దేవుడు- దానిని అనుసరించేవారి హృదయాలలో భద్రపరుస్తాడు అని అర్థం. దానికి ప్రబల ఆధారం ఏమిటంటే- ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పూర్తి ఖురాన్ ను కంఠోపాఠం చేసినవారు ఏడు సంవత్సరాల పిల్లల నుండి వంద సంవత్సరాల వృద్ధుల వరకు పురుషులే కాక, స్త్రీలు సైతం కొన్ని కోట్ల మంది ఉండటం. ఆ విధంగా “హృదయాల మీద వ్రాయబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే- అది ఒక్క ఖురాన్ గ్రంథం మాత్రమే!
5.అయితే ఈ వాస్తవాన్ని మరుగుపర్చటానికి పన్నిన కుట్ర ఏమిటంటే- “నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి” అన్న వాక్యాన్ని అదనంగా చేర్చటమే! నిజానికి అసలు దేవుడు క్రొత్తనిబంధన ఇవ్వటానికి కారణమే- అంతకు ముందు “యూదులు తమకు ఇవ్వబడిన నిబంధనను “వారు భంగం చేసుకొనిరి (my covenant (Law) they break)” అంటే వారు అనేకసార్లు అతిక్రమించి ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా దేవుడే- “లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి యున్నారు; కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి యున్నారు” — యెషయా 24:5 అని చెబుతున్నాడు. అటువంటప్పుడు దేవుడు మరో క్రొత్త ధర్మశాస్త్రాన్ని తిరిగి దానిని అతిక్రమించిన వారికే ఇవ్వటం అన్నది అర్థ రహితమవుతుంది.
ఈ విధంగా బైబిల్లో ఖురాన్ గురించి: -
1.అది ప్రకాశవంతమైన ధర్మశాస్త్రమని…
2.అది పారాను ప్రాంతం నుండి రానై ఉన్న ప్రవక్త ద్వారా ఇవ్వబడనుందని…
3.అది “వేరొక భాష”లో అవతరించనుందని…
4.అది ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అవతరించనుందని…
5.అది హృదయా మీద సైతం వ్రాయబడుతుందని…
ఎంతో స్పష్టంగా చెప్పబడిన వాస్తవాలను మరుగుపరచటానికి అనువాదాల్లో ఎన్ని మార్పులు చేసినా, వాక్య సందర్భాలు తప్పించి మాట్లాడినా సత్యం అనేది ఎంతమాత్రం మరుగున పడిపోదు లేదా అసత్యంగానూ మారిపోదు! కానీ బైబిల్ ఇంతగా గౌరవించే ఖూరాన్ గ్రంథం విలువ తెలియని మరియు ఏ మాత్రం బైబిల్ జ్ఞానం లేని అమాయకులు మటుకు ఖురాన్ ను విమర్శిస్తూ ఉంటారు.